![]() |
![]() |
వెండితెరపై విలన్‌గా మెప్పించినా, రియల్ లైఫ్‌లో మాత్రం కోట్లాది మందికి దేవుడై నిలిచాడు నటుడు సోనూ సూద్. కరోనా కష్టకాలం నుండి నేటివరకు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ నేనున్నానంటూ అండగా నిలబడుతూ రియల్ హీరో అనిపించుకున్నారు. అయితే, తాజాగా ఈ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ స్టార్ నటుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. లగ్జరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన ఆయన, తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
నటనపై ఉన్న మక్కువతో, నటుడిగా ఎదగాలనే బలమైన కోరికతో తాను పడిన సినిమా కష్టాలను సోనూ సూద్ ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. నాగ్‌పూర్‌లో చదువు పూర్తి చేసుకున్న తర్వాత, యాక్టర్ అవ్వాలనే పెద్ద కలతో ముంబై నగరానికి బయలుదేరిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ప్రయాణాల కోసం సరైన రిజర్వేషన్ దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డానని, కనీసం కూర్చోవడానికి కూడా చోటు ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పొడవాటి కంప్యూటర్ పేపర్లు, పాత న్యూస్ పేపర్లను మడతపెట్టుకుని రైలు ఎక్కేవాడినని సోనూ సూద్ వెల్లడించారు. రాత్రి వేళల్లో పడుకోవడానికి స్థలం లేక, రైలు బోగీల్లో ఉండే టాయిలెట్ పరిసరాల్లోనే ఆ న్యూస్ పేపర్లు పరుచుకుని నిద్రపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆయన చెప్పారు. ఆనాటి కఠినమైన రోజులతో పోలిస్తే.. ప్రస్తుతం భారతీయ రైల్వేలు సాధించిన ప్రగతి, మౌలిక సదుపాయాల క్వాలిటీ చూస్తుంటే గర్వంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు.
వందే భారత్ రైలులో లభిస్తున్న ప్రపంచ స్థాయి వసతులు, పరిశుభ్రత, రుచికరమైన ఆహారం మరియు సిబ్బంది అందిస్తున్న సేవలపై సోనూ సూద్ ప్రశంసల వర్షం కురిపించారు. సామాన్య ప్రజల ప్రయాణ అనుభవాన్ని ఇంతలా అద్భుతంగా మార్చినందుకు భారతీయ రైల్వే శాఖకు, కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రైల్వే శాఖ అద్భుతమైన పనులను ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, కేవలం సోనూ సూద్ మాత్రమే కాకుండా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూడా ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని కొనియాడారు. విమాన ప్రయాణాన్ని సైతం రద్దు చేసుకుని మరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకున్న ఆమె.. 'మేక్ ఇన్ ఇండియా' మౌలిక సదుపాయాల పట్ల గర్విస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దేశీయంగా తయారైన ఈ అధునాతన రైళ్లు మన దేశ ప్రగతికి సరికొత్త నిదర్శనాలని నెటిజన్లు సైతం కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం సోనూ సూద్ షేర్ చేసిన ఈ భావోద్వేగపూరితమైన వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సోనూ సూద్ స్వభావానికి, గతాన్ని మర్చిపోకుండా సామాన్యుల కష్టాలను గుర్తించే ఆయన మనసుకి అభిమానులు ఫిదా అవుతున్నారు.
https://x.com/SonuSood/status/2065642354263085378?s=20
![]() |
![]() |